BHAGAVATA KADHA-3    Chapters   

ప్రభు కృపను అర్జునుఁడు వర్ణించుట

50

శ్లో || యత్‌ సంశ్రయాత్‌ ద్రుపదగేహ ముపాగతానామ్‌

రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానామ్‌|

తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః

సజ్జీకృతే ధనుషాధిగతా చ కృష్ణా !

--భాగ. 1 స్కం. 15 అ.7 శ్లో.

అర్జునుఁడు జ్యేష్ఠ భ్రాతయగు ధర్మరాజునితో శ్రీకృష్ణ వియోగ వర్ణనము చేయుచు నిట్లనెను :- " రాజా! ఎవనికృపచే ద్రౌపదీ స్వయంవర సమయమున ద్రుపద సభాసమ్ముఖమున సమావేశ##మైన కామోన్మత్తులగు రాజుల తేజ ప్రభావములను నేను హరించితిని ? ధనస్సు నెక్కిడి మత్స్యయంత్రమును భేదించి త్రైలోక్య సుందరి యగు ద్రౌపదిని మనమందఱమును బడసితిమి ? ఇంత చేయఁగలుగుట ఆయన నాశ్రయించుట చేతనే సుమా ! ఆ శ్యామసుందరుఁడు మనల నందఱను వీడి స్వధామము చేరెను."

ఛప్పయ

దుఖ కో వారాపార న అర్జున కితహూ సావేఁ |

కృష్ణకృపా కూఁసుమిరి, నయన తేఁ నీర బహావేఁ ||

నాథ ! సారథీ సఖా సుహృద సంబంధీ బని కేఁ |

నిత నిత నేహ బఢాఇ, చాఁడి గమనే ఛల కరికేఁ ||

హాయ్‌! ప్రభో! అబజాఁయ కిత, ఇత ఉత నహిఁ సంతోష సుఖ||

అశ్రు పౌఁఛి బోలే బచన, తాత బాత తేఁ బఢ్యో దుఖ||

అర్థము

అర్జునుడు దుఃఖపారావారము నెట్లు దాఁటగలఁడు. ఆతఁడు శ్రీకృష్ణకృపను దలఁచుకొనుచఁ గంటనీరు గార్చుచు నాథా ! సారథివి, సఖుఁడవు, సుహృదుఁడవు, సంబంధివై నిత్యనూతన స్నేహమును బఱపి చివరకు మోసము చేసి వెళ్లిపోయి తివి కదా !

అయ్యో ! ప్రభూ ! ఇంక నెక్కడికి వెళ్లుదును. ఇంకెక్కడికి వెళ్లినను సంతోషసుఖములు లేవు. దుఃఖాశ్రువులను దుడిచి కొని అన్నా ! ఆవిషయములను దలఁచుకొను చుండిన దుఃఖ మతిశయించుచున్నది.

----

హృదయము దుఃఖముచే నిండిపోఁగానే నోట మాట రాదు. వాఙ్నిరోధము కలుగును. హృదయము బ్రద్దలగును. యథేష్టముగఁ గంటనీరు కార్చినను, తత్సంబంధమగు చర్చ జరిగినను, తద్యశోగానము చేసినను శోకముతగ్గి మనస్సు కొంతవఱకు కుదటబడును. అట్లే దుఃఖసమయమున బంధువులు వచ్చి యోదార్చిన నాసమయమున మృతిచెందినవాని గుణగానముచేయ మొదలిడుదురు :- ' ఆతని విషయమున నేమిచెప్పుదును. ఆతఁడు మానవుఁడు కాదమ్మా, సాక్షాత్తుగ దేవత. మాకతఁడిది చేసెను. అదిచెసే' నని చెప్పుకొనుచు శోకిత పురుషునకు ఆతని పరివారమునకు ధైర్యము చెప్పుదురు. పరోక్షపురుషుని చర్చ జరిగిన చిత్తము తదాకారమగును. ఆక్షణమున వియోగానుభవము కలుగదు. మనమాతని యెదుటఁ గుర్చుండి ప్రత్యక్షముగ మాట్లాడినట్లుండును. అందుకనియే శాస్త్రకారులు మాటి మాటికి భగవద్యశోగుణగానము, నామ గుణకీర్తనములకు మిక్కిలి బలమిచ్చినారు. లీలాకథారస నిషేవణమునఁదప్ప భగవచ్చరణారవిందములందు ప్రీతి కలుగుటకు ఇంకొక సరళ, సుగమ, సర్వసమ్మతమగు నుపాయము లేదనిరి. పరస్పరము ఆతని చర్చయే చేసుకొనవలయును, ఆతని గుణములనే గానము చేయవలయును, ఆతనిలోనే రమింపవలయును.

ధర్మరాజు మాటిమాటికి ప్రశ్నించుచు, అనేకములగు ననుమానములను వ్యక్త పఱచు చుండునప్పటికి అర్జునుడు దుఃఖమింక నధికమయ్యెను. ఆతఁడు దీర్ఘనిశ్వాసములు విడుచుచు దుఃఖవ్యాకులుఁడై, ముఖము బడలికచెంది, హృదయకమలము ముకుళితమై వాడిపోయినట్లుండెను. శరీర కాంతి మాసెను. ఆతఁడు సర్వాంతర్యామి ప్రభుధ్యానమును జేయుచుఁ బ్రేమ సాగరములో మునిఁగిపోయెను. ఆతనికి బాహ్య జగత్తేమియుఁ దెలియుటలేదు. ఆతఁడు ధర్మరాజు ప్రశ్నలకేమి జవాబీయఁ గలడు?

శోకవేగము కొంచెము తగ్గగానే చిత్తవృత్తి భగవద్ధ్యానమునుండి కొంచెము తొలగి యీలోకములోనికి వచ్చెను. అంతనాతఁడు అశ్రువులను జేతులతోఁ దుడుచుకొనెను. ఆసమయమున నాతని కనుఱప్పల క్రింద ఎఱుపెక్కెను. శ్రీకృష్ణుఁడంతర్హితుఁడగుటచేఁబ్రేమోత్కంఠతచేఁగాతరుడగుటవలన నాతఁడు మాటాడఁదలచినను మాటాడలేకపోయెను. ఆతఁడు శ్యామ సుందరుని త్రైలోక్యపావనమును మునిమనోహరిణియగు మనోహరమూర్తిని స్మరింపఁగానే యాతని హృదయము దుఃఖముతో నిండిపోయి కంఠము గద్గమగుచుండెను. ఆతని శ్రీకృష్ణ సాహచర్యము, స్నేహకార్యములు జ్ఞాపకమునకు రాఁగానే వికలుఁడగుచుండెను. ఈవిధముగ నాతఁడు చాలసేపున్న తర్వాతఁ జాల కష్టముమీఁద ధైర్యమువహించి, గద్గదకంఠముతో ధర్మరాజుతో నిట్లనెను :- " రాజా ! శ్రీకృష్ణుఁడు విశ్వాసఘాతము కావించినాడు."

ధర్మరాజు చకితుఁడై సంభ్రమముతో నిట్లనెను :- " అన్నివిషయములను జెప్పుము. ఏమైనది ? భగవంతుఁడు గొప్ప భక్త వత్సులుఁడు.''

రోదనము చేయుచు నర్జునుఁడిట్లనెను:- ''భక్తవత్సలుఁ డెచ్చటనున్నాడు? భక్త వత్సలుఁడే యగునెడల పాపినగు నన్నీ ధరాతలమున నిట్లొంటిగా వదలి తానొక్కఁడు స్వధామము నకుఁబోవునా ?"

ధర్మరాజు సింహాసనమునుండి క్రిందకుపడి యిట్లనెను :- " హా! శ్యామసుందరా! నిజముగ నీవీ ధరాధామమును వదలి వెళ్లిపోయితివా ?"

ధర్మరాజు క్రిందకు పడిపోవుటను గాంచి మంత్రి సచివాదులు జాగ్రత్తగఁ బట్టుకొని లేవనెత్తి మరల సింహాసనమునఁ గూర్చుండఁబెట్టిరి. యుధిష్ఠిర మహారాజు బాలకునివలె విలపించుచు నిట్లనెను :- " అర్జునా ! అర్జునా ! నీవు శ్యామసుందరుని వృత్తాంతమంతయుఁ జెప్పుము. ఆతని పావన కథలను జెప్పి నాసంతప్తహృదయమును కొంచెము సేవు శీతలము కావింపుము. నా హృదయము వజ్రముతోఁ జెయఁబడినది. శ్రీకృష్ణుని వియోగవార్తను వినియు బ్రద్దలు కాలేదు. ఇది ముక్కలు ముక్కలేల కాదు ? ఓరీ, తమ్ముఁడా ! నీవు మహాభారతయుద్ధములోఁజూపిన బలమేమై పోయినది ? అక్కడ ఉండియు నీవేమియుఁ జేయలేక పోయితివా ?"

కన్నుల నీరు గార్చుచు గద్గద కంఠముతో నర్జునఁడిట్లనెను :- " నాతేజ మెచ్చట నున్నది ? అదంతయు నాతని విభూతి. ఆతఁడే నాశరీరములోఁ బ్రవేశించి సమస్త కార్యములు చేయించినాఁడు. ఆతనితోడనే నా తేజముకూడ పోయినది. నేనిప్పుడు నిస్తేజుఁడను. నాలో నిప్పుడు బలపరాక్రమము లేవియును లేవు. నేను శవసమానుఁడ నైతిని. నేనే యననేల ? సమస్తలోకమును శ్రీకృష్ణుఁడు లేక శవమువలె నున్నది. నిర్జీవ ప్రాణివలె నైనది. నామీఁద నాతని కెంతటి కృప యుండెడిది ! నన్నెంతగాఁ బ్రేమించెడువాఁడు ! మొట్టమొదటగా ద్రౌపదీ స్వయంవరమున వాసుదేవుని దర్శనము నాకైనది. జలములచే నిండిన కారుమేఘము విద్యుత్పుంజముచే శోభించినట్లు, ఆతఁడా స్వయంవర భవనమున బలరామునితోఁ గూడి శోభించెను. అసంఖ్యాకములగు తారలలోఁ జంద్రుఁడు శోభించినట్లు, ఆరాజమండలిలో నాతఁడు వెలిఁగెను. అత్యంత ప్రేమమయదృష్టులతో నాతఁడు బ్రాహ్మణవేషములతో నన్ను మనలను జూచుచుండెను. ఆతని దృష్టులలో నింద్రజాలము కలదు. నే నాతనివైపు ఆకర్షింపబడితిని. ఆతఁడుకూడ తన ప్రేమనంతను బుంజీభవింపఁజేసి యా నిండు సభలో నాపై ఁ బరపెను.

ద్రౌపది త్రైలోక్యసుందరి. గొప్ప బలవంతులగు రాజులందఱు నామెను బొందవలెనని గట్టిగాఁ బ్రయత్నించుచుండిరి. యంత్రమునఁ గట్టఁబడిన చేఁపను గొట్టుటకు అందఱు నొకరిని మించి మఱియొకరు వ్యగ్రులై యుండిరి. అయోనిజయగు ద్రౌపది తమకే లభింపవలెనని ప్రతివానికి ఆశ. త్రిభువన సౌందర్యవతియగు ద్రౌపదిని జూడఁగానే అందఱ చిత్తములు చంచలములయ్యెను. పంచశరుఁడు తన పుష్పాయుధములచే నందఱను గొట్టుచుండెను. మత్స్యయంత్రమును గొట్టుట కృష్ణునకేపాటి కార్యము ? బృహత్సేనుని పుత్రియగు లక్ష్మణను వివాహము చేసికొనుట కిట్టి యంత్రముచే యాతఁడు భేదించియుండెను. ద్రుపద సభాభవనమునఁగల యంత్రమట్లే బయటకుఁ గనబడుచుండును. కాని బృహత్సేనుని సభాభవనమునఁగట్టఁబడిన యంత్రము గిఱ్ఱున ఁ దిరుగుచుండును. దాని ఛాయ మాత్రము జలములలోఁబడును. ఛాయను జూచి లక్ష్యము భేదింపవలయును. ఆ స్వయంవరమునకుఁగూడ రాజులందఱు వచ్చిరి. నేను నచ్చట నుంటిని. ఎవ్వరు నా లక్ష్యమును గొట్టఁజాలకపోయిరి. నేను లేచితిని. కాని నా బాణముకూడ లక్ష్యమును దాఁకుచుఁబోయినది.అంత శ్రీకృష్ణుఁడు లేచి నిమిషములో ఛాయను జూచి బాణముతో దానినిఁగొట్టెను. ఆతనికా కార్యములోఁ బ్రయాస మేమియుఁ దోచలేదు. అట్టివానికి ద్రుపద సభాభవనమున లక్ష్యమును భేదించుట ఏపాటిపని; కాని యాతఁడు దానిని గొట్టవలెనని మనస్సునైనఁ జింతింపలేదు. త్రైలోక్య సుందరి యగు ద్రౌపది మనకు భార్యకావలెనని యాతని కోరిక. అందఱ సమ్ముఖమున మనలను విజయులఁజేయుట కాతఁడు నడుము కట్టుకొనెను. ఆతఁడు మాటిమాటికి మనవైపు చూచుచు, దగ్గఱ కూర్చుండిన బలరాముని చెవిలో నేదియో చెప్పుచు, సైగలద్వారా మనవైపు చూచుచుఁ జెప్పుచుండెడువాఁడు. మనమామ వసుదేవునికుమారుఁడాతడేనని అప్పుడు గ్రహించితిని. ఆ నిండుసభలో నేను నా సర్వస్వము నాతని శ్రీచరణము లకు సమర్పించితిని.

రాజులందఱు లక్ష్యభేదనము చేయలేకపోవుటను గ్రహించి బ్రాహ్మణులందఱ ప్రోత్సాహముచే బ్రాహ్మణులలో గూర్చుండిన బ్రాహ్మణరూపధారినైన నేను లేచితిని. నేను లోలోన నా ప్రాణ ధనముల నన్నిటిని శ్యామసుందర చరణారవిందముల సమర్పించితిని. ఆతఁడు ప్రేమతో నన్నుఁగాంచి హృదయపూర్వక ముగ నా మేలును గోరెను. ఈ భిక్షుక బ్రాహ్మణుఁ డింతటి దుస్సాహసము చేయుచున్నాఁడేమి యని రాజులు, రాజకుమారులు చకితులైరి. గొప్ప బలవంతులగు రాజులు భేదింపలేని లక్ష్యమును నిరంతరము వేదాధ్యయనము చేయుచు దిరుగు అనాథ భిక్షుక బ్రాహ్మణుఁడెట్లు భేదింపఁగలుగునని వారి యాశ్చర్యము. నేను శ్రీకృష్ణకృపాబలమున నెవరిమాటలను లక్ష్యపెట్టక అందఱుఁ జూచుచుండఁగనే లక్ష్యమును భేదించి రాజులందఱ శిరములఁ గాలఁ దన్ని నేను ద్రౌపదిని గొని సభామండపము బయటకు వచ్చితిని.

అప్పటికి మీరు వచ్చివేసితిరి. నేను విజయుఁడ నగుటను గాంచి రాజులందఱు నామీఁద విరుచుకొని పడిరి. భీమసేనుఁడు వెంటనే అక్కడనుండి ఒక గొప్ప వృక్షమును బెల్లగించి దానితో రాజులను బాదఁ బ్రారంభించెను. ఆకార్యమును జూచి శ్రీకృష్ణుఁడెంత సంతోషముతో నిండిపోవుచుండునో నేనావైపున జూచుచుచు, అత్యుత్సాహముతో బలరామునకు మాటిమాటికి మమ్ములను బరిచయము కావించుచుండెను. శ్వేతవస్త్రమును ధరించి నావెంట వచ్చుటను, ఆమె నామెడకు వేసిన మాలను గాంచి ఆతఁడు ఆనందమున నృత్యము చేయుచుండెను. ఆతఁడు కనుఱప్ప వ్రాల్పక మా యనుపమ దాంపత్యమును గాంచి ముఱియుచుండెను.

రాజులనందఱ నోడించి మేము ద్రౌపదిని దీసికొని మా వాసస్థానమగు కుమ్మరివాని యింటికి వచ్చితిమి. అది రాత్రివేళ. నేను శ్యామసుందర మధురమూర్తినే చింతించుచుంటిని. ఇంతలోనే యాతఁడు బలరామునితోఁ గలిసి పద్మమాలను, పీతాంబరమును ధరించి మన దగ్గఱకు వచ్చెను. రాఁగానే యాతఁడు కుంతీదేవి పాదము లంటి, తర్వాత మీ పాదములమీఁద బడి యెంతో మమకారముతో నిట్లనెను :- " రాజా ! నన్నెఱుఁగవు ఇదివఱకు నీవు నన్ను ఁజూడలేదు. నేను వసుదేవుని కుమారుఁడగు శ్రీకృష్ణుఁడను. మీకంటెఁ జిన్నవాఁడను. " అప్పుడు మీరు మిక్కిలి ప్రేమతోఁగౌఁగిలించుకొంటిరి. ఆతఁడమాయకపు బాలునివలె బెరుకులేక తన యవయవములను ముడుచుకొని మీ కౌఁగిలిలో నిమిడెను. అంత నేను లేచి యాతనికిఁ బ్రణామము కావించితిని. తన విశాల బాహువులతో నన్ను వత్తుచు, గట్టిగా, గౌఁగిలించుకొనుచు, మందహాసముచేయుచు ద్రౌపదిని జూపించుచు వినోదముగ నిట్లనెను :- " అబ్యాయీ ! పిల్లయానల్లనిదే కాని చక్కనిది, తెలివికలది. మీ దాంపత్యము వర్థిల్లి బాగుగా ఫలించుగాక !" ప్రథమ సమావేశముననే యింతటి మమత్వము, ఇంతటి వాత్సల్యము నే నింతవఱకీ మానవలోకములోఁ జూడలేదు. ఆ సమయమున దొంగవలె నిట్లనెను :- " ఇప్పుడిఁక మేము వెళ్లెదము. మీ యందఱముందిప్పుడే ప్రకటమగుట ఉచితముకాదు. ఇప్పుడే ప్రకటమగునెడల మనకందఱకు అపాయము కలుగవచ్చును."

"రాజా! ఆ చరాచరస్వామికి ఎవరివలన నేమి భయము ? ఆతఁడు మనుష్యునివలె నటించెను. తన భక్తవత్సలతను జూపించెను. మనమీఁద సాంసారికముగ సంబంధమున్నట్లు గుర్తుచూపించెను. ఆతనికృపచే మనమందఱమును ద్రౌపదిని బడసితిమి. ద్రుపద మహారాజు సంబంధముచే మనకు మన పైతృక రాజ్యముకూడ లభించెను. భగవత్కృప లేకయుండిన మనకు రాజ్యమునిచ్చునదెవరు ? ఈవిధముగ భిక్షకులవలె వన, పర్వత, దుర్గ, నగరాదులలోఁదిరుగు మనకు ఆ సర్వేశ్వరుఁడు రాజ్యమిప్పిచి ఛత్రపతి సామ్రాట్టులను గావించెను. మనమందఱము దేవతలు స్వర్గములో వలె నింద్రప్రస్థములో నివసించుచున్నాము.

ద్రౌపదీదేవి, మీరు ఏకాంతమున నుండు భవనము లోనికి గోబ్రాహ్మణ రక్షణ నిమిత్తమై అస్త్రములు కొనిరాఁగా, అది నియమభంగమగుటచే నిశ్చయానుసారముగ ద్వాదశ వార్షికములు నేను వనవాసము చేయవలసివచ్చినది. ఈ సందర్భమున నేను ద్వారకకుఁగూడ పోయితిని. అచ్చట శ్రీకృష్ణుని చెల్లెలగు సుభద్రకు నాకు మనసు కుదిరినది. సర్వాంతర్యామికి తెలియని దేమున్నది ? ఈ సంగతికూడ ఆతనికి తెలిసినది. ఆతని యన్న బలరాముఁడీ సంబంధమున కంగీకరింపఁడని యాతనికిఁ దెలియును.ఆతనికి దుర్యోధనుని కీయవలెనని యుండెను. కాని శరణాగత వత్సులుఁడును, ఆశ్రితజనముల కోరికలఁదీర్చువాఁడు నగు దేవకీ నందనుఁడు నవ్వుచు నాచెవిలో నిట్లు చెప్పెను :- ' నీవు మెల్లగా నా చెల్లలగు సుభద్రను హరించుకొని పొమ్ము ' ఇంతేకాదు, ఆతఁడు తన రథమును గూడ నాకిచ్చెను. ఆహా ! ఆతని కృపాళుతావర్ణన మెంతనివర్ణింపఁగలను ? ఆతని దయ, అనుకంప, అనుగ్రహమును గూర్చిన కథ లెన్నని చెప్పుదును ? నేను చెప్పిన నేమైనను సరేయని నవ్వుచు నంగీకరించును. నేను చెప్పినదానికి కాదనుట ఆతనికి తెలియదు, చివరకు నన్నిట్లు మోసముచేసి పోవునని నాకేమితెలియును ? నేనిట్లేడ్చుచుండ నాతఁడు నన్నొంటిగా వదలి ఆతఁడొంటరిగా స్వధామమునకుఁ బోయినాఁడు. మొన్నమొన్న నేను వెళ్ళినప్పుడు కూడ ఆతఁడు చాలసేపు పూర్వము విషయములు నాతోఁజెప్పెను. ఆతఁడు నన్నెంత ప్రీతిఁగ జూచినాఁడు ! ఆతని విషయములు నా కొక్కక్కటి జ్ఞాపకమునకు వచ్చిన నాహృదయము శూలమువలె గ్రుచ్చినట్లై బాధపెట్టుచున్నది. రాజా ! ఇఁక లోకములో నుండరాదు ."

ఇట్లు పలుకుచు నర్జునుఁడు మరల భగవద్విషయములు, లీలలు హృదయపటలమున నంతకమగుటచే వివిధవిధముల విలపింపఁజొచ్చెను.

ఛప్పయ

జినకీ కృపా కటాక్ష పా ఇ హమ భ##యే సుఖారే |

రాజ 9కై సే కహూఁ శ్యామ నిజ ధామ పధారే ||

జినకే ప్రేమ ప్రసాద ప్రియా కృష్ణా సీ పా ఈ |

యంత్ర మత్స్య కూఁ వేధి ద్రుపద పుర లహీ బడాఈ ||

కామ మత్త సబ నృపని కే, సిర పై పై ర జమాఇ కేఁ |

ద్రుపద సుతా హమనే వరీ, గయే అనాథ బనాఇ కేఁ ||

అర్థము

అన్నా ! ధర్మజా ! ఏ మహామహుని కృపా కటాక్ష వీక్షణముచే మనమిన్ని కష్టములను గడచి సుఖమును బొందితిమో, అట్టి శ్యామసుందరుఁడు నిజధామమునకుఁ జేరిన వృత్తాంతము నేనేమని చెప్పఁగలను ? ఏమహామహుని కృపచే ప్రేమప్రసాదముచేఁ బ్రియమగు ద్రౌపదిని ద్రుపదమహాసభలో రాజులెవరికిని అలవికాని మత్స్యయంత్రమును గొట్టి కామమత్తు లగు నృపతుల నెల్లరశిరస్సులను గాలఁదన్ని చేకొంటిమో, ఎవని కృపచే ద్రౌపది మనల వరించెనో అట్టి వాఁడు మనల ననాథలఁ గావించి వైకుంఠమునకు వెళ్లిపోయినాఁడు.

BHAGAVATA KADHA-3    Chapters